తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు మునుగోడులో అంగరంగ వైభవంగా జరిగాయి. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వేలాది మంది మహిళలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. క్యాంపు కార్యాలయం నుంచి మహిళలతో కలిసి బతుకమ్మలను తీసుకువచ్చిన ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి వేదమంత్రాల నడుమ పూజలు నిర్వహించి, 15 అడుగుల భారీ బతుకమ్మకు హారతి ఇచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు. మహిళలతో కలిసి కోమటిరెడ్డి లక్ష్మి బతుకమ్మ ఆడగా, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మహిళలను ఆప్యాయంగా పలకరించారు. జానపద గీతాలు, ఆటపాటలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. వేడుకలకు హాజరైన మహిళలకు భోజన ఏర్పాట్లు చేయడంతో వారు భోజనాలు చేసి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఆడపడుచు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
