ఎంత నరకం అనుభవించిందో కానీ, ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కలహాలు, ఊళ్లో పరువు, అప్పుల బాధ.. నాలుగువైపుల నుంచి చుట్టుముట్టిన సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అత్తగారింటి నుంచి తల్లిగారింటికొచ్చిన సమస్యలు తగ్గలేదు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి తనువు చాలించాలని అనుకుంది. కట్టుకున్న భర్తకు, కన్నవారికి శోకం మిగిలిస్తూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన కురవి మండలంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండాలో మహిళ, తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది. పిల్లల కూడా మృతి చెందారు. లింగ్యాతండాకు చెందిన బానోతు నవీన్, అనూష దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం దంపతులు తండాలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం క్రితం నవీన్ ఫైనాన్స్ ద్వారా ఆటో కొనుగోలు చేసి నడిపేవాడు. అయితే ఆటో ద్వారా వచ్చే ఆదాయం ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడానికి సరిపోకపోవడంతో ఇతరుల వద్ద అప్పులు చేశారు.
అప్పులు పెరగడంతో ఇంటి స్థలాన్ని విక్రయించి, నవీన్ అత్తగారింటి వద్ద కుటుంబంతో ఉంటున్నాడు. ఫైనాన్స్ వాయిదాలు, చిట్టీ డబ్బుల చెల్లింపుల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తల్లితోనూ విభేదాలు తలెత్తడంతో గ్రామ పెద్దలు వారం రోజుల క్రితం పంచాయితీ నిర్వహించి, అనుషను కుటుంబంతో సహా అక్కడి నుంచి వెళ్లి వేరే చోట ఉండాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనూష తన కుమార్తె వర్షిణి, కుమారుడు విశాల్ కృష్ణతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకేసింది. స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
