దేశవ్యాప్తంగా దేవి నవరాత్రుల సంబరాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి వేడుకలు అంబరాన్నంటుకున్నాయి. దుర్గాదేవి నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. భ్రమరాంబిక బ్రహ్మచారిణిగా అనుగ్రహించనున్నారు. ఈ రెండు దివ్య స్వరూపాల పురాణ ప్రాశస్త్యం, పూజా సంప్రదాయాలు, పఠించాల్సిన శ్లోకాల గురించి తెలుసుకుందాం.
బెజవాడలో అలా! శ్రీశైలంలో ఇలా!
శక్తి ఆరాధనకు ప్రధానమైన ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవరాత్రులలో రెండో రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుండగా, ప్రముఖ శక్తి పీఠం శ్రీశైలంలో భ్రమరాంబిక బ్రహ్మచారిణిగా అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి అలంకారం విశిష్టత, బ్రహ్మచారిణి స్వరూపం విశిష్టత గురించి తెలుసుకుందాం.
గాయత్రీదేవి అలంకారం విశిష్టత
శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో పూజిస్తారు. ఈ అలంకారం వెనుక ఉన్న విశిష్టత ఏమిటో చూద్దాం.
సకల మంత్రాలకు మూలం
వేదమాత గాయత్రీ దేవి సకల వేద స్వరూపిణి! అన్ని మంత్రాలకు మూలశక్తి. ఈ రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంతమైన మంత్ర శక్తి, బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తాయని విశ్వాసం.
పంచముఖ దర్శనం
సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా అలరారుతున్న శ్రీ గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. సకల దేవత మంత్రాలకు గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంటుంది. అందుకే సమస్త దేవతా మంత్రాలకు చివర గాయత్రీ చేర్చి, రుద్ర గాయత్రీ, విష్ణు గాయత్రీ, లక్ష్మీ గాయత్రీ, వినాయక గాయత్రీ అని గాయత్రీ మంత్రంతో కలిపి చెప్తారు.
జ్ఞానం, ఐశ్వర్యప్రాప్తి
సకల దేవతలు నివేదించే పదార్ధాలన్నీ గాయత్రీ మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతే దేవతలకు నివేదిస్తారు. జ్ఞాన ప్రదాయిని అయిన గాయత్రీ మాతను పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయి.
ఏ రంగు వస్త్రం? ఏ పూలు? ఏ నైవేద్యం
ఈ రోజు అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. కనకాంబరాలతో అమ్మను పూజించాలి. వేదమాత శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి.
ఈ శ్లోకం పఠించాలి
“ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః” అని ఆ తల్లిని ప్రార్ధిస్తే సమస్త కోరికలు ఈడేరుతాయి.
దర్శన ఫలం
శరన్నవరాత్రులలో రెండో రోజు జగన్మాతను వేదమాత శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శించుకుని గాయత్రీ మంత్రం జపించడం వలన మనసు ప్రశాంతంగా మారి సకల పాపాలు నశిస్తాయని విశ్వాసం.
బ్రహ్మచారిణిగా భ్రమరాంబిక
ప్రముఖ శక్తి పీఠం శ్రీశైలంలో కూడా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులలో రెండో రోజు భ్రమరాంబిక బ్రహ్మచారిణిగా దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మచారిణి స్వరూపం విశిష్టత తెలుసుకుందాం.
బ్రహ్మచారిణి అంటే?
“బ్రహ్మ” అంటే తపస్సు, “చారిణి” అంటే ఆచరించేది అని అర్ధం. అందుకే ఈమెను ‘తపశ్చారిణి’ లేదా ‘అపర్ణ’ అని కూడా పిలుస్తారు.
శాంత స్వరూపం
బ్రహ్మచారిణీ దేవి స్వరూపం అత్యంత శాంతమైనది, జ్యోతిర్మయమైనది మరియు మంగళకరమైనది. అందుకు చిహ్నంగా ఈ తల్లి తెల్లని శుభ్రమైన కాంతులీనే శ్వేత ధవళ వస్త్రాలను ధరించి ఉంటుంది. ఈ తల్లికి ప్రత్యేకమైన వాహనం ఉండదు.
బ్రహ్మచారిణి స్వరూప పురాణ గాథ
బ్రహ్మచారిణి స్వరూపంలో దర్శనమిచ్చే ఈ జగన్మాత పూర్వజన్మలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీ దేవి. పరమశివుడిని భర్తగా పొందాలని నారద మహర్షి ఉపదేశంతో ఆమె ఘోరమైన తపస్సును ప్రారంభించింది
కఠోర తపస్సు
ఈ తల్లి వెయ్యి సంవత్సరాలు కేవలం పండ్లు, పూలు మాత్రమే ఆహారంగా తీసుకుంది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ఆకులు మాత్రమే తిని, చివరికి ఆహారపానీయాలు పూర్తిగా మానివేసి శివుని కోసం వేల సంవత్సరాల పాటు కఠిన దీక్ష చేసింది. అందుకే ఈ తల్లికి అపర్ణ అని పేరు వచ్చింది. ఆమె నిశ్చల భక్తికి, తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఆమెను అర్ధాంగిగా స్వీకరించాడు.
బ్రహ్మచారిణి విశిష్టత:
ఆదిశక్తి యొక్క ఈ స్వరూపం తపస్సును ఆచరించే రూపం. ఈ అమ్మ వారిని తపశ్చారణి అని అంటారు! ఈ తల్లి తన కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో శ్వేత వస్త్రాలు ధరించి వుంటుంది! జ్ఞాన దాయిని, మెాక్ష ప్రసాదిని అయిన బ్రహ్మచారిణి ఆరాధిస్తే జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయని విశ్వాసం.
దర్శన ఫలం
బ్రహ్మచారిణి స్వరూపంలో ఉన్న జగన్మాతను దర్శిస్తే జీవితంలో ఎంతటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, అనుకున్న కార్యాన్ని సాధించే శక్తి సిద్ధిస్తుంది.
ఈ రోజు పఠించాల్సిన శ్లోకం
దధానా కరపద్మాభ్యామక్షమాలాకమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
నవరాత్రులలో ఈ విధంగా ఆది పరాశక్తి రెండు స్వరూపాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. సకల శుభాలు పొందుదాం.